కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రాన్ని విభజించారు దుర్మార్గంగా : చంద్రబాబు విజయవాడ: రాష్ట్రాన్ని విభజించొద్దని ఎన్జీవోలు, ప్రజలు ఉద్యమించారని అయినా కాంగ్రెస్‌ నేతలు దుర్మార్గంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విభజించారని సీఎం చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాను కోరానన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరానన్నారు. ప్రజా జీవనాన్ని స్తంభింపజేసినా ఢిల్లీ పెద్దలకు కనికరం కలగలేదని, మన పొట్ట కొట్టిన వారు అడ్రస్‌ లేకుండా పోయారని చంద్రబాబు పేర్కొన్నారు. విభజనతో అనేక సమస్యలొచ్చాయని.. ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మూడేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నామని.. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. సరైన సమయంలో ఆర్థికసాయం అందితే చాలన్నారు.